రాములోరి కళ్యాణంలో దాస్యం ఫ్యామిలీ

వరంగల్ అర్బన్ జిల్లా : కరోనా ప్రభావం మనుషుల మీదనే కాదు, దేవుళ్లపై కూడా పడింది. ప్రతీ యేడాది ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన రాములోరి కళ్యాణ మహోత్సవాలు గత యేడాది నుంచి కొవిడ్ నిబంధనల నడుమ నిరాడంబరంగా జరుగుతున్నాయి. భద్రాద్రి ఆలయంతో పాటు ప్రతీ రాములోరి ఆలయాల్లో, హనుమాన్ ఆలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం కొద్ది మంది పురోహితులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో నిర్వహించారు. ఇందులో భాగంగానే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొవిడ్ నిబంధనల మధ్య శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది.

ads

వరంగల్ అర్బన్ జిల్లాలోని వడ్డేపల్లి, టీచర్స్ కాలనీ ఫేస్ 2 లలోని అభయాంజనేయ స్వామి దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబం పాల్గొంది. దాస్యం వినయ్ భాస్కర్ సతీమణి రేవతి , ఇద్దరు పిల్లలతో కలిసి మాజీ మంత్రి క్రీస్తుశేషులు దాస్యం ప్రణయ్ భాస్కర్ కుమారుడు, యువనాయకులు దాస్యం అభినవ్ భాస్కర్-మాధురి దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఆ ఆదిదంపతుల కళ్యాణ వేడుకను భక్తిపరవశంతో ఆస్వాదించారు.

కరోనాబారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని , సీఎం కేసీఆర్ కొవిడ్ నుంచి త్వరితగతిన కోలుకొని, పరిపాలనా వ్యవహరాల్లో పాల్గొనాలని దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబసభ్యులు ఆ ఆదిదంపతులకు కానుకలు, మొక్కులు సమర్పించుకున్నారు. అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారులు, స్థానిక నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.