కరోనాతో జీడబ్ల్యూఎంసీ ఎన్నికలో తగ్గిన పోలింగ్

వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు స్వల్ప అపశ్రుతుల మధ్య ముగిశాయి. పోలింగ్ 54.74 శాతంగా నమోదైంది. 2016 గ్రేటర్ఎన్నికల్లో 60.33 శాతం నమోదు కాగా, ఈ సారి 6 శాతం తగ్గడం గమనార్హం. కొవిడ్ ప్రభావంతో ఓటర్లు బయటకు రావడానికి భయపడటంతో పలు చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతూ కనిపించాయి. వృద్ధుల్లో చాలామంది ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ సారి జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరిగాయి. మే 3న పలితాలు రానున్నాయి.

ads

పోలింగ్ ఉదయం జోరుగా మొదలైనా, మధ్యాహ్నం నుంచి మందగించింది. ఉదయం 11 గంటల వరకు 23.62 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 44.15 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల గడువు ముగిసిన తర్వాత సగటు పోలింగ్ 54.74 శాతంగా తేలింది. ఓ వైపు ఎండల తీవ్రతతో పాటు, కొవిడ్ ప్రభావం పోలింగ్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఎండవేడిని తప్పించుకునేందుకు మహిళలు, వయేజనులు వచ్చి ఓట్లు వేసినప్పటికీ, ఉదయం 11 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతూ కనిపించాయి. ఇక కొవిడ్ నిబంధనలు పాటించని వారిని పోలీసులు పోలింగ్ కేంద్రాల నుంచి వెనక్కి పంపించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను థర్మల్ స్కానర్ తో పరీక్షించారు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఎక్కువ ఉన్నవారిని పక్కననిలబెట్టారు.

పోలింగ్ లో భాగంగా అక్కడక్కడ స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ 61 వ డివిజన్ అభ్యర్థి ఎలకంటి రాములు సెలూన్ షాపుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి షాపు అద్దాలు పగులగొట్టారు. కాజీపేట ఫాతిమానగర్ బ్రిడ్జికి ఎదురుగా ఉన్న ఈ షాపుపై ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. డబ్బుల పంపిణీలో తలెత్తిన వివాదమే దాడికి కారణంగా చెబుతున్నారు. ఇక పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కొన్ని చోట్ల కాషాయ రంగు బట్టలు ధరించి వచ్చిన ఓటర్లను పోలీసులు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో వారికి పోలీసులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.

తనిఖీలు….
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలోని పోలింగ్ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు క్రిస్టియానా చోంగ్తూ హన్మకొండలోని ఏకశిల కాలేజీలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కొవిడ్ రక్షణకు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ సిపి తరుణ్ జోషి, సుబేదారి, కేయూసీ, ఇంతేజార్ గంజ్, మట్టేవాడ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్ ల వినియోగంపై ఆరా తీశారు. సీపీ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, ఏసీపీలు జితేందర్ రెడ్డి, గిరికుమార్, ప్రతాప్ కుమార్, స్థానిక ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి సీసీ టీవీ ద్వారా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసిన 46 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఓటు వేసిన ప్రముఖులు…
జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం , ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తన సతీమణి వినయరాణితో కలిసి 60వ డివిజన్ వడ్డేపల్లి బ్యాంక్ కాలనీలోని సెయింట్ థామస్ హైస్కూల్ లో, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబసమేతంగా వడ్డేపల్లిలోని పింగిళి మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు వేశారు.

టీఆర్ఎస్ 60వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దాస్యం అభినవ్ భాస్కర్ కుటుంబసమేతంగా వడ్డెపల్లి పింగిళి పింగిళి ప్రభుత్వ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి వెంట ఓటును వినియోగించుకున్నవారిలో దాస్యం అభినవ్ భాస్కర్ తల్లి దాస్యం సబితా భాస్కర్, దాస్యం శిరీష , 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న శ్రీధర్, అనిల్ కశ్యప్ తదితరులు ఉన్నారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ఖిళా వరంగల్ రోడ్డులోని సన్ రైజ్ హైస్కూల్ లో , వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ పెరుకవాడలోని ప్రభుత్వ పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత లు హన్మకొండ నక్కలగుట్టలోని వాటర్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యాలయంలో కుటుంబసమేతంగా ఓటును వినియోగించుకున్నారు.

వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కుటుంబ సమేతంగా 17వ డివిజన్ బొల్లికుంట గ్రామంలో, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ 61వ డివిజన్ ప్రశాంత్ నగర్ లోని తేజస్వి స్కూల్ లో , మేయర్ రేసులో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి వరంగల్ రామన్నపేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ 31వ డివిజన్ అల్లూరి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ లోని పోలింగ్ కేంద్రంలో, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి సతీసమేతంగా 6వ డివిజన్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.