నల్లగొండ జిల్లా : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ డౌటేనని విప్, చెన్నూరు ఎమ్మెల్యే పెద్దవుర ఎన్నికల ప్రచార ఇన్చార్జి బాల్కసుమన్ జోస్యం చెప్పారు. గురువారం పెద్దవుర మండల కేంద్రం లో బాల్కసుమన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జానారెడ్డి ఏనాడు ప్రజలతో మమేకం కాలేదని ఆరోపించారు. జానారెడ్డి గతం టీఆర్ఎస్ భవిష్యత్ అని చెప్పారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేసి విలక్షణ తీర్పు ఇవ్వాలని బాల్కసుమన్ కోరారు. మండలానికో సామంత రాజును ఏర్పాటు చేసుకొని నియంతృత్వ పోకడలను అవలంభించిన జానారెడ్డి ని ప్రజలు మరిచిపోయారన్నారు.

సాగర్ నియోజకవర్గంలో మూడు లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తున్నామని బాల్కసుమన్ తెలిపారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని బాల్కసుమన్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీజేపీ బట్టేభాజ్ పార్టీ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఖేల్ ఖతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసిండని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇక నూకలు చెల్లిపోయాయన్నారు. పని చేసే ప్రభుత్వం టీఆర్ఎస్సే అన్నారు. అందుకే రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరిందన్నారు. పట్టభద్రుల తీర్పు టీఆర్ఎస్కు కొండంత బలాన్నిచ్చిందన్నారు. నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విప్ బాల్కసుమన్ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.