దొరస్వామిరాజు స్మారక పురస్కారాల ప్రదానం

“ఘనంగా తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ”

హైదరాబాద్​ : “తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్” హాల్లో శనివారం సాయంత్రం “తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు వేడుక” ఘనంగా జరిగింది.హెచ్ఎంరెడ్డి తీసిన తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” తొలిసారిగా బొంబాయి కృష్ణా టాకీస్ లో 1932 ఫిబ్రవరి 6 వ తేదీన రిలీజ్ అయిందని తన సిద్ధాంత వ్యాసం తో ప్రముఖ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ నిరూపించారు. దీంతో 2016 వ సంవత్సరం నుంచీ ప్రతి ఏడాదీ తెలుగు సినిమా తల్లి పుట్టిన రోజును ఒక వేడుకగా “కళా మంజూష”అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఘనంగా జరపడం మొదలు పెట్టింది.

తెలుగు చిత్రసీమలో అత్యంత సీనియర్ నటులను , నటీ మణులను, దర్శకులను, నిర్మాతలను మొదటిసారి భారీ ఎత్తున ఆ సంస్థ సత్కరించి ఒక కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టులలో సీనియర్లను ఎంపిక చేసి సన్మానించింది. ఇలా ప్రతిసారి తెలుగు సినిమాకి సంబంధించిన ప్రముఖులకు సత్కారాలు చేయాలని తలపోసిన ఆ సంస్థకు ఆ తర్వాత “తెలుగు సినిమా వేదిక”, “నేస్తం ఫౌండేషన్” సంస్థలు తోడయ్యాయి.

ఇటీవలే మరణించిన ప్రసిద్ధ నిర్మాత- డిస్ట్రిబ్యూటర్- ఎగ్జిబిటర్ వి దొరస్వామిరాజు పేరిట వారి “స్మారక పురస్కారాల”తో నలుగురు చిత్ర ప్రముఖు లను ఈ సభలో ఘనంగా సత్కరించారు.

ప్రసిద్ధ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నిర్మాతలు ఎన్ ఆర్ అనురాధా దేవి, జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి, గొట్టిముక్కల సత్యనారాయణ రాజులు ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు.

ప్రసిద్ధ నిర్మాత ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, ప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాతలు జీ ఆదిశేషగిరిరావు, ఏ.ఎం. రత్నం, దర్శక నిర్మాత ఎన్.శంకర్, ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, నటి కవిత, వీ దొరస్వామిరాజు కుమారుడు- నిర్మాత-నటుడు వీ విజయ్ కుమార్ వర్మ, ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ ఎం వీ రఘు, నటుడు-దర్శకుడు చిత్తరంజన్ తదితరులు ఈ సభకు అతిథులుగా హాజరయ్యారు.

సభకు హాజరైన ముఖ్య అతిథులతోపాటు నిర్వాహకులు దర్శకులు బాబ్జీ, రామ్ రావిపల్లి, నిర్మాతలు ఏ. గురురాజ్, విజయ్ కుమార్ వర్మ, పాకలపాటి విజయ వర్మ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మోహన్ గౌడ్, ఫిల్మ్ స్కూల్ ఉదయ్ కిరణ్, జర్నలిస్ట్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొన్నారు.

ఇక పై ‘ఫిలిం చాంబర్” ఆధ్వర్యంలో.. “ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్”, “తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్” “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” ఇలాంటి సంస్థల నేతృత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు సినిమా తల్లికి కనీసం వారం రోజుల పాటు జన్మదినోత్సవాన్ని జరపాలని అందుకు మనందరం కృషి చేయాలని పలువురు పెద్దలూ ఆకాంక్షించడం విశేషం.

నిర్వాహకుల్లో ఒకరైన నటుడు దర్శకుడు రామ్ రావి పల్లి సభను ఆద్యంతం రసరమ్యంగా నడిపించారు. ఆయన తన వాయిస్ ఓవర్ తో రూపొందించిన వీ దొరస్వామిరాజు బయోగ్రాఫికల్ రీల్ (ఏవి), సన్మానితుల పరిచయ చిత్రం(ఏవి) అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

తదనంతరం చిత్ర ప్రముఖులంతా కలిసి తెలుగు సినిమా తల్లి బర్త్ డే కేక్ కట్ చేసి..ఆమె జన్మదినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కిక్కిరిసిన ప్రేక్షకులతో సభ నిండుగా కొనసాగింది.