ఆసీస్ ఓపెన్ విన్నర్ జొకోవిచ్

మెల్ బోర్న్ : సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ పై 7-5, 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో గెలిచాడు. నొవాక్ కు ఇది 9వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. గతంలో మరే ప్లేయర్ ఇన్నిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గలేదు. అతని కెరీర్ లో ఇప్పటి వరకు 18 గ్రాండ్ స్లామ్ టోర్నీలను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ లో ఇప్పటివరకూ జొకోవిచ్ కు ఓటమి ఎరగని రికార్డు ఉండటం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లోనూ జొకోవిచ్ పూర్తి ఆదిపత్యం కనబరిచాడు. తొలి సెట్ లోనే మెద్వెదెవ్ నుంచి కాస్త పోటీ ఎదురైనా తర్వాతి రెండు సెట్లను నొవాక్ సునాయాసంగా గెలిచాడు.