టీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన డీకే

వరంగల్ అర్బన్ జిల్లా : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తేనే ఉద్యోగాలు, పీఆర్సీ అమలు జరుగుతాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని డీకే అరుణ హెచ్చరించారు. హన్మకొండ అదాలత్ లోని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కార్యాలయంలో విలేకరుల సమావేశానికి హాజరైన డీకే అరుణ సీఎం కేసీఆర్, రాష్ట్రంలో పాలనపై ఫైర్ అయ్యారు. ఎన్నికలు అనగానే సీఎం కేసీఆర్ కు ప్రకటనలు, హామీలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పుకు భయపడిన కేసీఆర్ మళ్లీ ఎన్నికలు అనగానే వణుకుపుడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మార్చి 14న జరుగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమి చవిచూడటం ఖాయమని ఆమె అన్నారు.

ads

 

ఆ భయంతోనే సీఎం కేసీఆర్ ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఉద్యోగులకు పీఆర్సీ పెంపును ప్రకటించాడని, ఉద్యోగులు కేసీఆర్ మాటలను నమ్మవద్దని ఆమె సూచించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ను ఓడించి , మాట తప్పిన కేసీఆర్ గుణపాఠం చెప్పాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.