డాక్టర్లు దేవుడితో సమానం

హైదరాబాద్ : వ్యాపార దృష్టి కాకుండా సేవా దృక్పథంతో ముందుకు సాగే వైద్యులను సమాజం దేవుడి మాదిరిగా గౌరవిస్తుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వైద్య శిరోమణి,సేవారత్నపేరిట వివిధ అంశాలలో నిష్ణాతులైన డాక్టర్లకు మెగాసిటీ నవ కళావేదిక పురస్కారాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆపదలో ఉన్న రోగి ప్రాణాలు కాపాడిన డాక్టర్‎ను మనం ఎంతగానో గౌరవిస్తామని, దేవునితో సమానంగా భావిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వైద్యవృత్తికి గొప్ప విలువ ఉందని, సమాజం పట్ల బాధ్యత కలిగి సేవా దృక్పథం కలిగి ఉండే వారికి ఇటువంటి పురస్కారాలు, సత్కారాలు లభిస్తాయన్నారు. వైద్యో నారాయణ హరి అంటే.. డాక్టర్ భగవంతుడితో సమానమని బిసి కమిషన్ మాజీ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు.

ఈ కార్యక్రమానికి సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించగా, వేదిక వ్యవస్థాపకులు మల్లికార్జున్ రావు, డాక్టర్ ఆశీస్ చౌహాన్, కె.శ్రీనివాసచారి, రాఘవ సాయినాథ్, ఆర్.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23మంది డాక్టర్లకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మంత్రి కొప్పుల ఈశ్వర్‎ని శాలువాతో సన్మానించారు.