ఉగాది నాటికి ప్రతీ ఇంటికి మంచినీరు

వరంగల్ అర్బన్ జిల్లా : మహా నగర సమగ్రాభివృద్ధికి చేపడుతున్న అభివృద్ధి పనులను శీఘ్రగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‎లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి నెలలో ట్రయల్ రన్ నిర్వహించి ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరును ప్రతీ రోజు అందించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

గ్రేటర్ వరంగల్‎లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలో 14 వందల డబుల్ బెడ్ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేసుకుని లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మార్చి నాటికి 400 ఇండ్ల ప్రవేశం, జూన్ వరకు మరో 1000 ఇండ్ల ప్రవేశం జరుగనున్నట్లు వెల్లడించారు. ఉగాది నాటికి కాళోజి ఆడిటోరియం పూర్తి కావాలని ఆదేశించారు. వరంగల్ నగరంలో మొత్తం 33 జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాలలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపునేని నరేందర్ , పురపాలక,పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేషన్ ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.