జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

హైదరాబాద్​ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జల విహార్ లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు స్వయంగా చెక్కులు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ads

‘జర్నలిస్టులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అన్నారు. వృత్తి నిర్వహణలో ప్రాణాలు కొల్పోయిన జర్నలిస్టులకు తన సంతాపాన్ని తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలు ఎవరూ రోడ్డున పడకుండా సీఎం కేసీఆర్ ముందుచూపుతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని కేటీఆర్​ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంస్కారవంతమైనదని, కేసీఆర్​ మనసున్న సీఎం అన్నారు. వివిధ హోదాల్లో జర్నలిస్టులుగా పని చేసిన వారందరికీ సీఎం, మంత్రులు సుపరిచితులేనన్నారు.

జర్నలిస్టుల సంక్షేమంలో మీడియా అకాడమీ పాత్ర ప్రశంసనీయమన్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉంటాయని, అకాడమీ చేస్తున్న కార్యక్రమాలు ఉదాత్తమైనవని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాలను నిబద్దతతో చేపట్టాలని సూచించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. ఇందుకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు కలెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడి పాఠశాలలలో కులాలకు అతీతంగా విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జర్నలిస్టు వృత్తి నుంచే ఎదిగారని అన్నారు. జర్నలిస్టులకు ఎల్లవేళ్లలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తారని’మంత్రి కేటీఆర్​ కొనియాడారు.

‘జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే సంక్షేమ నిధికి రూ. 34 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కేటీఆర్​ను కలిసిన సందర్భంలో మీడియా అకాడమీ సంక్షేమ నిధి కార్పస్ ఫండ్ మంజూరుకు మరిన్ని నిధులు కేటాయించవలసిందిగా కోరిన వెంటనే స్పందించారన్నారు. మంత్రి 17 కోట్ల 50 లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేశారని అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఇప్పటి వరకు 260 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 2 కోట్ల 60 లక్షల ఆర్థిక సహాయం, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన 93 మంది జర్నలిస్టులకు 50 వేల చొప్పున 46 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. ఈ రోజు 91 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, 18 మంది తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించామని అల్లం నారాయణ తెలిపారు. భవిష్యత్తులో సంక్షేమ నిధి ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో మీడియా అకాడమీ అండగా ఉంటుందని’అల్లం నారాయణ భరోసానిచ్చారు.

మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా సిరిసిల్లకు చెందిన వడ్డేపల్లి రాజేశం, నిజామాబాద్ కు చెందిన కవిత, వరంగల్ కు చెందిన ఆమంచి పద్మావతి, ఖమ్మంకు చెందిన హమీదా బేగం, సూర్యాపేటకు చెందిన సంధ్యారాణి, మహబూబ్ నగర్ కు చెందిన భాగ్యలక్ష్మి, మెదక్ కు చెందిన చంద్రకళ, అదిలాబాద్ కు చెందిన రాజమణి, రంగారెడ్డికి చెందిన వెంకటమ్మ, హైదరాబాద్ కు చెందిన హేమలత, సంగీతలకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మీడియా అకాడమీ కార్యదర్శి మహ్మద్ ముర్తుజా, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, మీడియా అకాడమీ సిబ్బంది పూర్ణ చందర్ రావు, వనజ, ప్రసాద్, సిటీ ప్రెసిడెంట్ యోగానంద్, టీయూడబ్ల్యూజే నాయకులు భాస్కర్, సూరజ్ కుమార్, నవీన్, అమిత్ బట్టూ, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, జర్నలిస్టులు భారీ సంఖ్యలో హజరయ్యారు.