తెలంగాణ గ్రామాల్లో మళ్ళీ ఎన్నికల సందడి !

తెలంగాణ గ్రామాల్లో మళ్ళీ ఎన్నికల సందడి !

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పంచాయతీ రాజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ అంశం ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోని పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది గడుస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఈ నేపథ్యంలో, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, యువ వికాసం వంటి పథకాలు ఎన్నికలకు అనుకూల వాతావరణం కల్పిస్తాయని సర్కార్ భావిస్తోంది. ఈ పథకాలు ప్రజల్లో సానుకూల స్పందన కలిగించడంతో, ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయమని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రకటన రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.