ముగిసిన పంచాయతీ ప్రచారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో తొలి విడుత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 7.30 నిమిషాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. గత ఐదు రోజులుగా అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికి తిరిగి వారిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో రాత్రి నుంచి ప్రలోభాల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుత 168 మండలాల్లోని 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు.

పోలింగ్‎కు పూర్తి ఏర్పాట్లు చేశామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్నం 1గంటల30 నిమిషాల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందని వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.