ముగిసిన పంచాయతీ పోలింగ్


అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో తొలివిడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో ఒకటి రెండు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరడం కనిపించింది. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పోలింగ్ ప్రారంభం కాగా 10గంటల వరకు మందకొడిగా సాగింది. 8 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11 గంటల 30 నిమిషాల వరకు 34.28 శాతం నమోదైంది.

నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల వరకే పోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీసుల భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకే ఒకటి రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికాసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశముంది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచ్‎ల ఎన్నిక నిర్వహిస్తారు.

అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే ఎన్నిక రేపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడుత 12 జిల్లాలోని 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తొలిదశ పోలింగ్‎లో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.