భారత్ ఘోర పరాజయం

చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్‎లో భాగంగా టీం ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‎లో 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఈ సిరీస్‎లో బోణీ కొట్టింది. అండర్సన్ 3/17, లీచ్ 4/76 అద్భుత బౌలింగ్ చేశారు. భారత బ్యాట్స్‎మెన్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (72; 104 బంతుల్లో 9×4 ), శుభ్‎మన్ గిల్ ( 50; 83 బంతుల్లో 7×4,1×6) అర్ధశతకాలు సాధించి టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‎లో 178 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

39/1 ఓవర్ నైట్ స్కోర్‎తో మంగళవారం ఐదో రోజు ఆట ప్రారంభించిన టీం ఇండియా ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫాంలో ఉన్న పుజారా (15), రహానె(0), పంత్ (11), వాషింగ్టన్ సుందర్ ( 0) పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా మరో ఎండ్ నుంచి సహకారం లేకపోయింది. మధ్యలో అశ్విన్ (9; 46 బంతుల్లో 1×4) కాస్త తోడు నిలవడంతో ఏడో వికెట్‎కు 54 పరుగులు వచ్చాయి.

తర్వాత మళ్లీ లయ అందుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు భారత్‎ను 200 లోపే కట్టడి చేశారు. ఉదయం బ్యాటింగ్ ఆరంభించిన గిల్ , పుజారా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించారు. స్పిన్ బౌలింగ్‎ను దీటుగా ఎదుర్కొంటూ మ్యాచ్‎ను కాపాడేటట్లు అనిపించారు. ఈక్రమంలోనే లీచ్ వేసిన ఓ చక్కటి బంతికి పుజారా ఔటయ్యాడు. బౌన్స్ అయిన బంతి బ్యాట్ అంచున తాకుతూ నేరుగా వెళ్లి స్లిప్‎లో ఉన్న స్టోక్స్ చేతిలో పడింది. దీంతో భారత్ 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ఇక కోహ్లీ క్రీజులోకి రాగా, కాసేపటికే గిల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఇక్కడే రూట్ తమ ప్రణాళికను అమలు పరిచాడు. బంతి స్వింగ్ అవుతుండటంతో అండర్సన్ బరిలోకి దించాడు. అతడు ఒకే ఓవర్‎లో గిల్ ,రహానే(0) నుబౌల్డ్ చేయడంతో మ్యాచ్‎పై పట్టు సాధించింది. ఇక అక్కడి నుంచి ఒత్తిడికి అశ్విన్ కాసేపు వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలోనే భారత్ 144/6తో భోజన విరామానికి వెళ్లింది. తర్వాత కోహ్లీ అర్ధశతకం సాధించాక మళ్లీ ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించారు. లీచ్ ఓ చక్కటి డెలివరీతో అశ్విన్‎ను బుట్టలోకి వేసుకున్నాడు. ఆపై స్టోక్స్ కోహ్లీని బౌల్డ్ చేశాడు. దీంతో టీంఇండియా ఓటమి ఖాయమైంది. చివరికి నదీమ్ ( 0), బుమ్రా ( 4) త్వరగానే ఔటయ్యారు.