అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ

వరంగల్ అర్బన్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మేయర్ గుండా ప్రకాష్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మేధావి. నాడు రాజ్యాంగాన్ని రాసే కమిటీలో 7 గురు సభ్యులు ఉండగా, ఒక్కొక్కరు ఒక్కో కారణంతో అందుబాటులో లేకపోవడంతో ఒంటిచేత్తో రాజ్యాంగం రాసిన ఒకే ఒక్కడు అంబేద్కర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తిశిఖరం, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. మన దేశంలో రాజ్యాంగం అమలు చేసుకున్న గణతంత్ర దినోత్సవం రోజే బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషాన్నిస్తుంది. ఆయన విగ్రహాన్ని మన వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నేను ఆవిష్కరించడం నా అదృష్టం అని మంత్రి చెప్పారు.ఆ మహనీయునికి పుష్పాంజలి ఘటిస్తున్నాను. దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి అయిన అంబేద్కర్, అంటరానితనాన్ని, అనేక అవమానాలను అధిగమించి మహోన్నత వ్యక్తిగా ఎదిగాడు. ప్రపంచంలో ఎవరూ చదవనంతగా చదివి అనేక డిగ్రీలు పొందాడు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా అంబేద్కర్ చేసిన కృషి చాలా గొప్పది అని అన్నారు. అంటరానితనం పోవాలని మహిళలకు సమాన హక్కులు ఉండాలని పోరాడాడు. కుల నిర్మూలన కోసం కృషి చేశాడు. కుల మతాల విచక్షణ, విభేదాలు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం సక్సెస్ కాదని చెప్పిన, ముందుచూపు ఉన్న వ్యక్తి. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందిన రోజే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుందని భావించాడు అని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల కోసం అంబేద్కర్ ఆనాడు గాంధీతో సైతం విభేదించాడు. అందుకే డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ముందు చూపు వల్లే మన దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈ రిజర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని మంత్రి వివరించారు.

సీఎం కేసీఆర్ కూడా గొప్ప అంబేడ్కర్ వాది. సీఎం కేసీఆర్ అంబేడ్కర్ స్పూర్తితో, ఆయన ఆశయాలకు అనుగుణంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి లకు సబ్ ప్లాన్ పెట్టీ, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఆయా వర్గాలకు కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా నియమ నిబంధనలను కఠినంగా పెట్టారని మంత్రి చెప్పారు.

బడుగు బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లకు నష్టం కలగకుండా నే…అగ్ర కుల వర్గాలకు కూడా, ఆర్థిక బలహీనత ప్రాతిపదికగా పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ది. మన సమాజ మూలాలు తెలిసిన కేసీఆర్ సబ్బండ కుల వృత్తులను కాపాడుతూ అందరి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అనేక పథకాలు ప్రారంభించారు. ఎస్సీల అభ్యున్నతికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. 500 జనాభా కలిగిన పల్లె లను గ్రామ పంచాయితీలు గా చేసి అణగారిన లంబాడీ వర్గాలకు సర్పంచ్‎లుగా అవకాశం కల్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని నామినేటెడ్ పోస్టులు, ప్రతినిధుల ఎన్నికలోను అన్ని వర్గాలకు సమంగా రిజర్వేషన్లు ‎కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఆశయాలకు మనమంతా పునరంకితం అవుదామని మంత్రి చెప్పారు.

ఈ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, తాటికొండ రాజయ్య , పలువురు కార్పొరేటర్లు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడిని మంత్రి సత్కరించారు. పలు సంస్థల క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఇతర అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు.