మరణించిన మత్స్యకారులకు ఎక్స్‎గ్రేషియా

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చెల్లించే ఎక్స్ గ్రేషియాను త్వరలోనే అందజేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం మాసాబ్ ట్యాంక్‎లోని తన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంత్రి శ్రీనివాస్ యాదవ్‎ను కలిశారు. ఇటీవల గంగపుత్ర సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశాలలో ఒక కమిటీ ని ఏర్పాటు చేసుకొని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి గంగపుత్ర సంఘం ప్రతినిధులకు సూచించారు. మంత్రి సూచనల మేరకు జేఏసీగా ఏర్పడిన అనంతరం ఈ రోజు గంగపుత్రులు మంత్రిని కలిశారు. నూతనంగా ఏర్పాటైన సమితి సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‎తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమైఖ్య రాష్ట్రంలో మత్స్యకారుల బాగోగులను పట్టించుకోలేదని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించదని చెప్పారు. మత్స్యకారులు అభివృద్ధి చెందాలనే తపనతో ఎవరు అడగకుండానే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నందున చెరువులపై మత్స్యకారులకే అధికారాలు ఉంటాయని, దళారీ వ్యవస్థ నిర్మూలనకు కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. సంఘ సభ్యులు సమిష్టిగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన కాళేశ్వరం, పాలమూరు, కొండపోచమ్మ, సుందిళ్ళ తదితర నూతన ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పెద్ద ఎత్తున మత్స్య సంపద పెరిగిందని, పెరిగిన సంపదను ఈ వృత్తిలోని వారందరికి అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. మత్స్యకారులు చేపలను విక్రయించుకోనేలా సబ్సిడీ‎పై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాలీలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో అందుబాటు ధరలో చేపలను విక్రయించేందుకు సబ్సిడీ‎పై మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ను జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఔట్ లెట్స్‎తో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలలో కూడా ఈ ఔట్ లెట్స్‎ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

తమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‎కి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‎కి తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దీటి మల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. గంగపుత్రులు ఉన్న చోట గంగపుత్రులకే సభ్యత్వం కల్పించాలని, గంగ తెప్పోత్సవంను అధికారికంగా నిర్వహించాలని కోరారు.ఇక మత్స్యకారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, గంగపుత్ర ఫెడరేషన్‎ను ఏర్పాటు చేయాలని ఇంకా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఈ సందర్భంగా మంత్రికి అందజేశారు. త్వరలోనే మరో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, సీఎం స్థాయిలో ఉన్న సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ హన్మంతరావు, కన్వీనర్ యాదగిరి, కోశాధికారి గడ్డం సాయి కిరణ్ తదితరులు ఉన్నారు