అగ్రి చట్టాలతో ‘హోలీ కా దహన్’ చేసిన రైతులు

న్యూఢిల్లీ : గీత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలకు దిగిన రైతులు వినూత్నంగా హోలీ జరుపుకున్నారు. ఆదివారం రాత్రి హోలీకా దహన్ కార్యక్రమంలో భాగంగా రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను మంటల్లో వేసి కాల్చివేశారు. చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా హోలీ జరుపుకుంటున్నట్లుగానే , ఇది కేంద్రం చట్టాలపై రైతుల ఆగ్రహానికి ప్రతిరూపమంటూ నినాదాలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంద వరకు అన్ని పండుగలను ఇలాగే ఇక్కడే జరుపుకుంటామని రైతులు ముక్తకంఠంతో నినదించారు.

ads

వారు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లోనే కుంకుమ, గులాల్ చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. కేంద్రంపై వ్యతిరేకతతో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు నేటికి 123వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ -ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఖాజీపూర్ లో ప్రదర్శనలు జరుపుతున్న రైతులు , హోలీ సందర్భంగా జానపద నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ పండుగను ఆస్వాదించారు. కొంతమంది రైతులు పాడుతూ కనిపించగా, కొందరు రంగులు చల్లుకుంటూ వేడుక జరుపుకున్నారు.