సంక్షేమంలో దేశంలోనే తొలిస్థానం

హైదరాబాద్ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై నాంపల్లి, కార్వాన్ నాయకులతో హోం మంత్రి శనివారం నాడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా హోం మంత్రి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తల్లి గర్భంలోకి ప్రవేశించిన వెంటనే పిల్లల కోసం సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తుందని, ఆపై జీవితంలోని వివిధ దశలలో కొనసాగుతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ స్థాపన కోసం వరుసగా 14 యేండ్లు కష్టపడ్డారని, గాంధీజీ పద్దతిలో అహింసను అవలంభించడం ద్వారా విజయం సాధించామని హోంమంత్రి గుర్తుచేశారు.

ఈ సమావేశంలో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడారు. ప్రతీ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి చేరుకోవడానికి వారు కృషి చేయాలని, మహిళలు, పురుషులు, యువత, ముఖ్యంగా విద్యార్థి సంఘ సభ్యులను పార్టీ కృషి, విజయాలు ప్రశంసించడం ద్వారా వారిని పార్టీలోని సభ్యులుగా మార్చాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమాను ప్రారంభించింది. దీనిలో పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే, అతనికి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇవ్వబడుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ఒక లౌకిక పార్టీ అని, కేసీఆర్ ఒక లౌకిక నాయకుడన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సాధించిన ప్రధాన ఘనత ఉచిత నీటి సరఫరా అని అన్నారు. సీఎంగా కేసీఆర్ సాధించిన, అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ప్రజా నాయకుడిగా కేసీఆర్ విధానాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని హోంమంత్రి కోరారు.

ఈ సమావేశంలో సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యుడు సాయి కిరణ్ యాదవ్, నాంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ పార్టీ ఇన్‌ఛార్జ్ ఆనంద్ గౌడ, కారవాన్ నియోజకవర్గ అసెంబ్లీ పార్టీ ఇన్‌ఛార్జ్ జీవన్ సింగ్, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ రహీముల్లా ఖాన్ నియాజీ తదితరులు పాల్గొన్నారు.