మాడ్రన్ సెలూన్ల ఏర్పాటుకు రూ. లక్ష

నల్లగొండ జిల్లా : ఆధునిక క్షౌరశాలలు, మాడ్రన్ సెలూన్ల ఏర్పాటుకు నాయీ బ్రాహ‌్మణులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున మంజూరు చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని అనుముల మండలం పాలెం గ్రామ శివారులో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాద సభ బుధవారం జరిగింది. ఈ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కుల వృత్తుల సంక్షేమంపై మాట్లాడారు. అనేక వృత్తి కులాలను పైకి తెచ్చ ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. గొల్ల, కురుమలకు గొర్రె పిల్లల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ చేపట్టినట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగానే నల్లగొండ వేదికగా తాను ఒకటే విషయాన్ని మనవి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. గ్రామాల్లో గడ్డం గీస్తే ఏ చెట్టుకిందనో కూర్చుని గీస్తుంటారు. ఈ పరిస్థితులు మారిపోయి ప్రతీ గ్రామంలో నాగరికంగా ఉండేవిధంగా, సంస్కారవంతంగా ఉండేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లో ఈ బడ్జెట్ తర్వాత నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.