ఆత్మహత్య కేసులో నలుగురు అరెస్టు

వరంగల్ అర్బన్​ జిల్లా : అదనపు కట్నం కోసం వేధించి భార్య మృతికి కారణమైన భర్త, అత్త మామ మరియు మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాటికొండకు చెందిన అక్కనపల్లి మాధురి(22) వడ్డేపల్లి లోని పింగిలి కళాశాలలో డిగ్రీ చదువుతున్న క్రమంలో వడ్డేపల్లి కి చెందిన తిరుపతి తో ప్రేమలో పడింది. దీంతో ఇద్దరు 2019లో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం బాగానే నడిచింది. 3 నెలల తర్వాత తిరుపతి కుటుంబ సభ్యులు కట్నం కోసం మాధురి ని వేధించసాగారు. ఈ విషయాన్ని మాధురి తన పుట్టింటి వారికి చెప్పింది.

దీంతో మాధురి కుటుంబ సభ్యులు రెండు లక్షలు, 3 తులాల బంగారం కట్నం కింద ముట్టజెప్పారు. అయినప్పటికీ కూడా మాధురి అత్త మామ లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో వారి వేధింపులు తట్టుకోలేక ఈ నెల మూడో తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మాధురి ఆత్మహత్య చేసుకుంది. మాధురి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు నలుగురు నిందితులు తిరుపతి వినయ్ -భర్త , తిరుపతి సదానందం- మామ, పద్మ -అత్త ,చందు- మరిదిలను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపర్చారు.