లైంగికదాడి కేసులో నలుగురు అరెస్టు

హైదరాబాద్​ : హైదరాబాద్​లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బీఫార్మసీ విద్యార్థినిపై
లైంగికదాడి జరిగింది. ఘటనపై హైదరాబాద్​ రాచకొండ పోలీసులు గురువారం వివరాలు వెల్లడించారు. కాలేజీ పూర్తి అయిన తరువాత యువతి సాయంత్రం ఆరు గంటలకు నాగారం చేరుకుంది. .6.05 నిమిషాలకు అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే విద్యార్థినితో పాటు మరో ఇద్దరిని డ్రైవర్ ఆటోలో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరంలో ఆటోలో ఎక్కిన ఇద్దరు ప్రయాణికులను ఆటో డ్రైవర్ దించారు​. 6 గంటల 10 నిమిషాలకు యువతి దిగాల్సిన కాలనీ వద్దకు ఆటో చేరుకుంది. డ్రైవర్​ ఆపకుండా ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు. వెంటనే అప్రమత్తమైన యువతి తల్లికి ఫోన్ చేసి నన్నెవరో కిడ్నాప్​ చేశారు అమ్మా ..అంటూ తన తల్లికి విషయాన్ని చెప్పింది. యువతి తల్లి వెంటనే విషయాన్ని సమీప బంధువైన యువకుడికి సమాచారం తెలిపింది. దీంతో ఆ యువకుడు 6:29కి డయల్​ 100కు ఫోన్​ చేసి విద్యార్థిని కిడ్నాప్​కు గురైందని సమాచారం అందించాడు.

గంట ఇరవై నిమిషాల్లోనే దారుణం జరిగింది

బాధితురాలు తల్లికి ఫోన్​ చేసిన సమయం నుంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ఒక గంట ఇరవై నిమిషాలు పట్టింది. ఈ వ్యవధిలోనే ఆ గ్యాంగ్​ యానం పేట వద్ద ఆటోను ఆపి అక్కడ నిలిపి ఉన్న మారుతి కారులోకి యువతిని బలవంతంగా ఎక్కించారు. అనంతరం ఘట్​కేసర్ రైల్వే ట్రాక్ వద్దకు తనను తీసుకువచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకునేసరికి వీరికి మరో ఇద్దరు తోడయ్యారు. ఆటో డ్రైవర్​తో పాటు ఆ ముగ్గురు ఆటోలోనే అమ్మాయి పై కర్రలతో దాడి చేసి లైంగికదాడికి పాల్పడ్డారు.

డయల్​ 100 నుంచి యువతి కిడ్నాప్​కు గురైందన్న సమాచారం తెలుసుకున్న కీసర, ఘట్​ కేసర్​ పోలీసులు కలిసి మూడు పెట్రోలింగ్​ వాహనాల్లో బయలు దేరారు. యువతి ఫోన్​ సిగ్నల్​ ట్రాక్​ చేసి తను అన్నోజిగూడ సమీపంలో ఉన్నట్లుగా కచ్చితంగా సమాచారం తెలుసుకుని 7:50 నిమిషాలకు లొకేషన్​ గుర్తించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సైరన్ విన్న ఆ గ్యాంగ్​ యువతిని ఘట్​కేసర్​ రైల్వే ట్రాక్​ పైన వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకునే సరికి పూర్తిగా అపస్మారక స్థితిలో చిరిగిన బట్టలతో ఉన్న బాధితురాలిని పోలీసులు పెట్రోలింగ్​ వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో స్పృహ వచ్చిన అనంతరం బాధితురాలి నుంచి పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కేసు విచారణలో ప్రత్యేక బృందాలు

ఘట్​కేసర్​ సీఐ చంద్రబాబునాయుడు సెలవులో ఉండడంతో విచారరణ అధికారిగా నరేందర్​గౌడ్​ను రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేశ్​ భగవత్​ నియమించారు. విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు,కీసర పోలీసులు రంగంలోకి దిగాయి. యువతి ఆటో ఎక్కిన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించారు. యువతిపై ఆటో డ్రైవర్​తోపాటు ముగ్గురు లైంగికదాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 365 సెక్షన్​ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

క్యూర్​ ఆస్పత్రి వైద్యురాలు తెలిపిన వివరాలు

బాధితురాలిని తమ ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చేసరికి ఆమె స్పృహలో లేరు. బాధితురాలిలో ఇంట్రల్​ ఇంజూరీస్​ ఉన్నాయని వైద్యురాలు సౌజన్యరెడ్డి చెప్పారు. మెడికల్​ ఎగ్జామినేషన్​ కోసం పంపించాము. ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు చెబుతుందని వైద్యురాలు తెలిపారు. యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడి చేసినట్లు తెలుస్తుందని క్యూర్​ హాస్పిటల్​ వైద్యురాలు సౌజన్యరెడ్డి పేర్కొన్నారు. అలాగే బాధితురాలి తలకు , కాలుకు గాయాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యంగా ఉందన్నారు. రిపోర్ట్స్​ వచ్చాక పూర్తి స్థాయి విషయాలు తెలుస్తాయని డాక్టర్​ సౌజన్యరెడ్డి వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వ్యక్తుల్లో మార్పు రావాలని అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో విద్యార్థిని క్షేమంగా ఉందని డాక్టర్​ సౌజన్యరెడ్డి చెప్పారు. ఘట్​కేసర్ ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రిపోర్ట్​ అందిస్తామని వెల్లడించారు.