చంద్రకాంత్‎కు ఎఫ్‎టీసీసీఐ అవార్డు

హైదరాబాద్ : టాలెంట్‎కు, పట్టుదలకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించుకున్నాడు. తాను దివ్యాంగుడైనా స్వయం ఉపాధిలోనూ తనకెవరూ సాటిలేరని నిరూపించుకున్నాడు. ఆ ఉపాధి సైతం పర్యావరణహితంగా ఉండేలా చూసుకున్నాడు. చాదర్ ఘాట్ కు చెందిన చంద్రకాంత్ సాగర్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కేవలం చక్రాల కుర్చీకే పరిమితం అయిన అతని శరీరంలో పూర్తిస్థాయిలో సహకరించేవి చేతులు మాత్రమే. మూసారంబాగ్ ప్రశాంత్ నగర్ లో సంచుల తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతర ప్రాంతాల నుంచి రీసైక్లింగ్ సరకును తీసుకొచ్చి వాటితో ప్రత్యేక యంత్రంపై సంచులు తయారు చేసి పెద్ద కంపెనీలకు సరఫరా చేస్తున్నాడు. నాన్ వోవెన్ సంచులు, సర్జికల్ మాస్కులు తయారీ చేస్తుంటాడు.

అంతేకాకుండా సామాజిక ఆలోచనతో తాను చేస్తున్న ఈ పనిని మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచిన చంద్రకాంత్ సాగర్‎ని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. గుర్తించడమే తడవుగా చంద్రకాంత్ సాగర్ ని ఎఫ్‎టీసీసీఐ అవార్డు వరించింది. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఎఫ్ టీసీసీఐ భవన్ లో వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఇండస్ట్రీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురు వ్యక్తులను మంత్రి చేతుల మీదుగా అవార్డుల బహుకరణ జరిగింది. ఈ క్రమంలో భాగంగా విభిన్నమైన సామర్థ్యం కలిగిన అత్యత్తమ ప్రదర్శన చూపిన దివ్యాంగుడు చంద్రకాంత్ సాగర్ కి మంత్రి అవార్డును ప్రదానం చేశారు.