పంతం నెగ్గించుకున్న మేయరమ్మ

హైదరాబాద్: మేయర్ పదవి వచ్చి 24 గంటలు కూడా కాలేదు. అంతే తన అధికారాన్ని చూపించుకుంది జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. పదవి రాగానే ప్రతీకారం తీర్చుకుంది. తనపై పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసిన ఎమ్మార్వోని బదిలీ చేయించి పంతం నెగ్గించుకుంది. ఈసంఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో షేక్‎పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు కార్పొరేటర్‎గా ఉన్న విజయలక్ష్మి మీద పోలీసులకు ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మేయర్ పీఠం రాగానే పంతం నెగ్గించుకుని ఎమ్మార్వోను సీసీఎల్‎కు బదిలీ చేయించారు.

అప్పట్లో బంజారాహిల్స్ కార్పొరేటర్ గా ఉన్న విజయలక్ష్మిపై షేక్‎పేట ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆఫీస్‎లోకి బలవంతంగా వచ్చి తన మీద దాడికి పాల్పడ్డారని ఫిర్యాదుచేశారు. హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా , తనను అడ్డుకుని, దుర్భాషలాడిందని, కేకే కూతురునంటూ నానా హంగామా చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులు షేక్‎పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో హల్చల్ చేశారని, విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులు షేక్‎పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను దుర్భాషలాడటమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుండగా అడ్డుకుని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో వెల్లడించారు.

అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి తీరుతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మేయర్ పదవి రాగానే పంతం నెగ్గించుకున్న విజయలక్ష్మి తీరుపై పలు విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.