డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడడం వల్ల ఆదివారం అలకనంద, దౌలీగంగా నదుల్లో భారీ వరద వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 20కు చేరుకున్నది. ఉత్తరాఖండ్ ఉప్పెనలో రిషిగంగా. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం జోషీమఠ్ వద్ద ఉన్న తపోవన్ టన్నెల్‌ను ఐటీబీపీ జవాన్లు శుభ్ర పరుస్తున్నారు. టన్నెల్లో భారీ స్థాయిలో వరదమట్టి కూరుకుపోయింది. తపోవన్ టన్నెల్ ప్రవేశం వద్ద బురద మట్టిని తొలగించేందుకు ఆర్మీ సిబ్బంది కఠోరంగా పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్ దళాలు కూడా ఈ పనిలో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.
పెద్ద పెద్ద జేసీబీలతో టన్నెల్ వద్ద ఉన్న మట్టిని రాత్రంతా క్లీన్ చేశారు. జనరేటర్లు, సెర్చ్లైట్లు పెట్టి మట్టిని తొలగించే పని చేపట్టారు ఆర్మీదళాలు, ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్ దళాలు. సుమారు 80 మీట్లర దూరం మేర టన్నెల్‌ను శుభ్రం చేసినట్లు డీఐజీ అపర్ణా కుమార్ పేర్కొన్నారు. జేసీబీలతో మట్టిని తొలగింప జేస్తున్నట్లు వివరించారు. టన్నెల్ సుమారు 180 మీటర్ల పొడువు ఉన్నట్లు తెలిపారు. టన్నెల్ లోపల దాదాపు 40 మంది వరకు కార్మికులు ఉంటారని అంచనా వేశారు. వారిని కాపాడేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు డీఐజీ అపర్ణాకుమార్.