ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

హైదరాబాద్​: ఎస్సీల సంక్షేమం, ఉన్నతికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పాటుపడుతున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

‘ఎస్సీల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా బడ్జెట్లో రూ. 16వేల 534కోట్లు కేటాయించారు. పెద్దసంఖ్యలో గురుకులాలను తెరిచారు. అందరికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య, పోషకాహారాన్ని సీఎం కేసీఆర్​ అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. ఎస్సీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు 21పథకాలు అమలు చేస్తున్నాం. సబ్సిడీపై రుణాలు ఇచ్చేందుకు రూ. 786 కోట్లు కేటాయించాం. వివిధ అంశాలలో నైపుణ్యం పెంపొందించి, ఉద్యోగ, ఉపాధి అందిపుచ్చుకునేందుకు శిక్షణ ఇప్పిస్తాం. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశామని మంత్రి కొప్పుల వెల్లడించారు.

జగిత్యాలలో కొత్తగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. పెద్దపల్లిలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. నిరుద్యోగ యువత పోటీ పరీక్షల కోసం ప్రిపేరయ్యేందుకు ప్రతి మండలంలో ఒక స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాలని, సోలార్ విద్యుత్ ద్వారా వేడి నీటి సౌకర్యం కల్పించాలి. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి ’అని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఉన్నతాధికారులు రాహూల్ బొజ్జ, విజయ్ కుమార్, యోగితా రాణ, డాక్టర్ ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్, కరుణాకర్, హన్మంతు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు