ధరల పెంపులో ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి

జనగామ జిల్లా : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అన్నారు. కమీషన్ల పేరిట పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయని జంగా రాఘవరెడ్డి విమర్శించారు. పెట్రోల్ , డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా జనగామ జిల్లాలో జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. చమురు ధరల పెంపులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ads

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంలో ఆంతర్యం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని జంగా రాఘవరెడ్డి ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వెన్ను విరిగేలా చేస్తున్నామని మండిపడ్డారు. 5 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 43 సార్లు పెరిగిందని జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో సామాన్యులకు అందుబాటులో ధరలను ఉండేలా నియంత్రణ చేపడితే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పోరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో డీజిల్, పెట్రోల్ మధ్య లీటర్ కు రూ.30 నుంచి రూ.40 రూపాయల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఐదు రూపాయల దూరంలో డీజిల్ ధర ఉండడం సిగ్గుచేటన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోలు వంద దాటగా.. జనగామ జిల్లాలో కేవలం 39 పైసల దూరంలో ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ, సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోలు, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని జంగా రాఘవరెడ్డి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఎర్రమల సుధాకర్, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ వేముల సత్యనారాయణరెడ్డి , డాక్టర్ లక్ష్మీనారాయణ , టౌన్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి , ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదేపాక రాంచందర్, కౌన్సిలర్లు చంద్రకళ రాజు చందర్, మల్లేశం, ఆంజనేయులు, కల్యాణి మల్లారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ రామ్ , జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివరాజ్ యాదవ్, జిల్లా ఇన్నేసి వైస్ ప్రెసిడెంట్ అభిగౌడ్, జిల్లా మైనార్టీ సెల్ జమాల్ షరీఫ్ , మాజీ కార్పోరేటర్ దయాకర్ రెడ్డి , మహేందర్ రెడ్డి, రంగరాజు ప్రవీణ్ కుమార్, యూత్ అధ్యక్షుడు ఎండీ మాజిద్ , గౌస్పాషా , ముహూర్తాల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.