గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

హైదరాబాద్ : కొవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేకసార్లు సమీక్షలు చేశారని తెలిపారు. నేడు ఉదయం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.20 వేల కోట్లకు పౌరసరఫరాల శాఖకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చామన్నారు. రైతులకు బాసటగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ads

సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలన్నారు. ఒకరిని చూసి ఒకరు దొడ్డరకం వరి సాగు చేయకపోవడం మంచిదన్నారు. వరి సన్నరకాలే సాగు చేయాలని సూచించారు. వానాకాలంలో పత్తి, కందిసాగు విస్తీర్ణం పెంచాలన్నారు. యాసంగిలో 52 లక్షల 79 వేల 682 ఎకరాల్లో వరి సాగు చేశారు. కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఎఫ్.సీ.ఐ. 80 లక్షల మెట్రిక్ టన్నులు , మిల్లర్లు 20 లక్షల మెట్రిక్ టన్నులు, విత్తనాల కంపెనీలు 10 లక్షల మెట్రిక్ టన్నులు, పొరుగు రాష్ట్రాల మిల్లర్లు 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. తేమశాతం, తాలు నిబంధనలకు లోబడి ధాన్యం తేవాలని సూచించారు.

రాష్ట్రంలో గతంలో 54 లక్షల ఎకరాలలో సాగయితే, ఈ యేడాది 61 లక్షల ఎకరాలలో సాగు చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 70 నుంచి 75 లక్షల ఎకరాలకు పెరగాలన్నారు. తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉందని, తెలంగాణ పత్తి నాణ్యత దేశంలో మొదటి స్థానంలో ఉండగా, పత్తి దిగుబడిలో దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. సీఎం పిలుపు మేరకు కంది సాగును రైతులు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో వేరుశనగ పంట విస్తీర్ణం పెంచాలని రైతులకు సూచించారు. రైతులకు రాష్ట్రంలో విత్తనాల లభ్యతకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల సామర్థ్యంతో గోదాములు ఉన్నాయి. భవిష్యత్ లో అన్ని జిల్లా కేంద్రాల్లో గోదాములు నిర్మాణం చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి ఆంక్షలు లేనివిధంగా పంటలను సాగు చేయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని ఆ దిశగా ప్రభుత్వ సూచనలను రైతులు ఆచరించాలని మంత్రి కోరారు. అదే విధంగా భవిష్యత్ లో కేంద్రం కొన్ని బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి .. ఈ నేపథ్యంలో రైతులను ముందే అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. పంటల సాగు విషయంలో శాస్త్రీయ అధ్యయనం చేసి ‘ఎర్నెస్ట్ – యంగ్ సంస్థ’ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది, దాని ప్రకారం రైతులకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించి చైతన్యం చేయడం జరుగుతుందని చెప్పారు.

రైతులు కోవిడ్ నిబంధనలు పాటించాలి .. తాలు లేకుండా, నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా చూసుకుని మద్దతు ధర పొందాలని కోరారు. కరోనా నేపథ్యంలోనే తిరిగి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 80 – 85 నియోజకవర్గాలలో పుష్కలంగా సాగునీరు అందుతోందని తెలిపారు. పంటల కొనుగోళ్లపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.