గ్రేటర్‎లో అభివృద్ధికే పెద్ద పీటం

వరంగల్ అర్బన్ జిల్లా: మహా నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ రావు అధ్యక్షతన బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో జరిగింది. సమావేశంలో 86 ఎజెండా అంశములు, 91 టేబుల్ అంశములు చర్చకు రాగా, చర్చ అనంతరం కౌన్సిల్ ఆమోదించింది. దాదాపు ఎజెండా, టేబుల్ అంశాలలో రూ.258.64 కోట్లతో 576 అభివృద్ధి పనులు చేపట్టుటకు కౌన్సిల్ ఆమోదించింది.

అతి తక్కువ సమయంలో ఎక్కువ సమావేశాలను నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించి నగరాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశామని మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. గత 35-40 సంవత్సరాలలో ఇంత పెద్దఎత్తున నగరాభివృద్ధికి నిధులను కేటాయించలేదని, నిధులను కౌన్సిల్ సమావేశాల ద్వారా ఆమోదించుకొని గ్రేటర్ అభివృద్ధిలో పాలు పంచుకోవడం సంతోషించదగిన విషయమని మేయర్ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన అభివృద్ధిని, అనతికాలంలోనే సాధించుకున్నామన్నారు. గ్రేటర్ వరంగల్‎లో రూ.300 కోట్ల అభివృద్ధి పనులు పూర్తిచేసి బిల్లులు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఇక ముగింపు దశలో ఉన్న రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడానికి సిద్దంగా ఉన్నామన్నారు మేయర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇటీవల రూ.250 కోట్లు కేటాయించి విడుదల చేసిందన్నారు.

కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అద్భుతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఈ కౌన్సిల్ సమావేశంలో మేయర్ వెల్లడించారు. నగరంలోని 58 డివిజన్‎లలో అభివృద్ధి పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు నగరాభివృద్ధికి దాదాపు రూ.1100 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులను ఆమోదించుకొన్నామని పేర్కొన్నారు. ఎన్నో అంశాలలో గ్రేటర్ వరంగల్ ఘన విజయం సాధించిందన్నారు. నగరంలో మూడు మాసాలలోనే కొత్తగా 350 టాయిలెట్లను నిర్మించామని తెలిపారు. నగరంలో ఒక నర్సరీకి అదనంగా 16 నర్సరీలను ఏర్పాటుచేసి హరితహారం కోసం మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. స్మశాన వాటికలు, పార్కులు కమ్యూనిటీ హాలులకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి అభివృద్ధి చేసుకున్నామన్నారు.

బల్దియా ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశామని, 42 విలీన గ్రామాలను 183 స్లంలను అభివృద్ధి పర్చుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ నగరం అభివృద్ధి చెందని విధంగా గ్రేటర్ వరంగల్‎ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకొంటున్నామని అన్నారు. రాంపూర్‎లో బయో మైనింగ్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వరంగల్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 260 వాహనాలను కొనుగోలు చేశాం, పారిశుధ్యం మరింత మెరుగు పరచడం కోసం మరిన్ని వాహనాలు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసర అభివృద్ది పనుల కోసం నామినేషన్ పద్ధతిన కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులకు ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మేయర్ నిధులను మంజూరు చేశారు.

అనంతరం ఈ సర్వసభ్య సమావేశంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను తెలుపుతూ, డ్రైనేజి, అంతర్గత రహదారులు, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్ళు ఏర్పాటు చేయాలని కోరారు. సి‌ఎం‌ఏ పెండింగ్ నిధుల మంజూరు చేయాలని, 2018 నుండి నూతన పెన్షన్‎లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని మేయర్‎ను విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో 58 డివిజన్ల కార్పొరేటర్లు, ఎం‌ఎల్‌సి బస్వరాజు సారయ్య, డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజొద్దీన్, కొ-ఆప్షన్ సభ్యులు, బల్దియా అదనపు కమిషనర్ సి‌హెచ్.నాగేశ్వర్, ఎస్‌ఈ సత్యానారాయణ, సి‌పి నర్సింహారాములు, సిఎం‌హెచ్‌ఓ డా.రాజారెడ్డి, సెక్రెటరీ విజయలక్ష్మి, సి‌హెచ్‌ఓ సునీత, ఉప కమిషనర్‎లు గోధుమల రాజు, రవీందర్ యాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.