విత్తనోత్పత్తి గ్రామంగా ఇబ్రహీంపూర్!

సిద్ధిపేట జిల్లా : ఇబ్రహీంపూర్ గ్రామాన్ని వచ్చే వానాకాలం విత్తనోత్పత్తి గ్రామంగా చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‎రావు పేర్కొన్నారు. సిద్ధిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మేనేజ్ సహకారంతో దేశాయ్ కోర్సు పూర్తయిన సందర్భంగా 40 మంది పెస్టిసైడ్స్ డీలర్లకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఎరువులు, క్రిమి సంహారకాలు ఎక్కువగా వాడకుండా జాగ్రత్త పడేలా రైతులకు అవగాహన కల్పించాలని పెస్టిసైడ్స్ డీలర్లను మంత్రి హరీశ్‎రావు కోరారు. అధిక దిగుబడికి ఎరువుల వాడకం అవసరం మేర వాడేవిధంగా రైతులను చైతన్యపర్చాలని మంత్రి డీలర్లకు సూచించారు. ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పండించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ పనిముట్ల కోసం 1500 కోట్ల రూపాయలు ప్రవేశ పెట్టినట్లు మంత్రి వెల్లడించారు.

ads

కలెక్టరేట్‎లో సిద్ధిపేట నియోజకవర్గంలోని 8 గ్రామాలైన తోర్నాల, బుస్సాపూర్, ఇర్కోడ్, చిన్నగుండవెళ్లి, ఎల్లుపల్లి, నాంచారుపల్లి, మందపల్లి, మల్లారం గ్రామాల్లో 500 ఎకరాల్లో తెలంగాణ సోనా ధాన్యం పండించేందుకు దక్కన్ ముద్ర కంపెనీ ముందుకొచ్చి, మంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 28న ఆయిల్ ఫామ్ సాగుపై 2 వేల మంది రైతులతో వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‎ను మంత్రి ఆదేశించారు. త్వరలోనే చిన్నకోడూర్ మండలం చండ్లపూర్ గ్రామ రైతులతో కలిసి సెరి కల్చర్, ఎక్స్ పోజర్ విజిట్ కోసం మైసూర్ వెళ్లనున్నట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయిల్ ఫామ్ సాగుపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.