హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య

హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది దంపతులను దుండగులు నరికి చంపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో చోటుచేసుకుంది. న్యాయవాది వామన్ రావు, భార్య నాగమని కారులో హైదరాబాద్ నుంచి మంథని వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిని కలవచర్ల పెట్రోల్ పంపు ఎదుట దుండగులు అడ్డుకున్నారు. అడ్డుకున్నదే తడవుగా కారులో ఉన్న దంపతులిద్దరిని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో దంపతులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీసీపీ రవిందర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.