సోనియా, రాహుల్ కు నోటీసులు

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీ సహా ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. స్వామి పిటిషన్ పై ఏప్రిల్ 12 లోగా బదులివ్వాలని గాంధీలతో సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా, యంగ్ ఇండియా ( వైఐ) లకు నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యవహారంలో హైకోర్టు పలువురికి నోటీసులు జారీ చేసిందని బీజేపీ ఎంపీ తరుపు న్యాయవాది సత్య సబర్వాల్, కాంగ్రెస్ నేతల తరపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది తరన్నం చీమ నిర్ధారించారు. ఏప్రిల్ 12 లోగా ఈ పిటిషన్ పై బదులివ్వాలని గాంధీలను కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణను అప్పటివరకు నిలిపివేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే అసోసియేషన్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్ కు అందచేసిన రూ.90.25 కోట్ల రుణాల వసూళ్ల హక్కులను కేవలం రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు కట్టబెట్టడం జరిగింది.

దీని ద్వారా కాంగ్రెస్ నేతలు మోసపూరితంగా వ్యవహరించడంతో పాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రత్యేక న్యాయస్థానంలో బీజేపీ నేత ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు.