పోలీస్ శాఖలో భారీగా ప్రమోషన్స్

ads

హైదరాబాద్‌: పోలీస్‌శాఖలో సీనియారిటీ జాబితా చిక్కులకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీనియారిటీ జాబితాకు అనుగుణంగా డీఎస్పీ, అదనపు ఎస్పీల పదోన్నతుల ప్రక్రియకు శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ- డీపీసీ) ఆమోదముద్ర వేసింది. దీంతో కొంతకాలంగా న్యాయ వివాదాలతో పాటు పదోన్నతుల కూర్పులో నెలకొన్న జాప్యానికి తెరపడింది. ఈ జాబితాకు అనుగుణంగా శుక్రవారం పదోన్నతుల జీవో వెలువడింది. ఈక్రమంలో సీఐల పదోన్నతులకు మార్గం సుగుమమైంది. కొద్ది రోజుల్లోనే 122 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు దక్కనున్నాయి. డహాక్‌ పదోన్నతుల నుంచి రెగ్యులరైజ్‌ పదోన్నతుల జాబితా భారీగానే ఉన్నా అందులో మూడొంతుల మంది ఇప్పటికే పదోన్నతుల్లో కొనసాగుతుండటం గమనార్హం. ఉదాహరణకు నాన్‌కేడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు పొందిన అధికారుల జాబితాలో 41 మంది ఉన్నారు. వీరిలో 13 మంది ఇప్పటికే నాన్‌కేడర్‌ ఎస్పీలుగా కొనసాగుతున్నారు. గతంలోనే వీరికి అడహాక్‌(తాత్కాలిక) పదోన్నతులు కల్పించడమే ఇందుకు కారణం. అప్పట్లో సీనియారిటీ జాబితా సరిగా లేకపోవడంతో వీరికి అడహాక్‌ పదోన్నతులతో పోస్టింగ్‌లిచ్చారు. వీరిలో కొందరు జిల్లా ఎస్పీలుగానూ పనిచేస్తున్నారు. వీరిని నాన్‌కేడర్‌ ఎస్పీలుగా రెగ్యులరైజ్‌ చేయనున్నారు.

తాజా జాబితాలో మిగిలిన 28 మంది మాత్రమే ప్రస్తుతం అదనపు ఎస్పీలుగా ఉంటూ నాన్‌కేడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు పొందినట్లు లెక్క. అలాగే డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతుల జాబితాలో 74 మంది పేర్లున్నాయి. వీరిలో 17 మంది మాత్రమే ప్రస్తుతం డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందుతున్నారు. మిగిలిన 57 మంది ఇప్పటికే అడహాక్‌ పదోన్నతులు పొంది అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్నారు. అంటే విధి నిర్వహణ పరంగా ఇప్పటికే మూడొంతుల మంది పదోన్నతుల్లో కొనసాగుతుండగా, ప్రస్తుతం సాంకేతికంగా మాత్రమే వీరిని పదోన్నతులు వరించాయి. ఈ నేపథ్యంలో వీరిలో పలువురు ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే కొనసాగనున్నారు. తాజాగా పదోన్నతులు పొందిన అధికారులు మాత్రం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయనున్నారు. ఇక సంచలనం సృష్టించిన కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు డీఎస్పీలు తాత్కాలికంగా పదోన్నతులకు అర్హత కోల్పోయారు. సీనియారిటీ జాబితా ప్రకారం వీరు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందే అవకాశమున్నా తాజా డీపీసీ జాబితాలో వీరికి చోటు దక్కలేదు.