భార్య కేసు పెట్టడంతో భర్త అఘాయిత్యం

వరంగల్ అర్బన్ జిల్లా : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని భర్త రెచ్చిపోయాడు. పోలీస్ స్టేషన్ ముందే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కాపాడేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌కి గాయాలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వేధించడం మొదలుపెట్టాడో కసాయి భర్త. భరించలేకపోయిన భార్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో అవమానంగా ఫీలయ్యాడు. కట్టుకున్న భార్యే తనపై కేసు పెట్టిందన్న ఉక్రోషంతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పోలీస్ స్టేషన్ ముందే అనూహ్యంగా ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అప్రమత్తం కావడంతో గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్‌లో జరిగింది.

ads

నగరంలోని లేబర్ కాలనీకి చెందిన హరిక్రిష్ణ, వనజ మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె సంతానం. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఆటోడ్రైవర్‌గా పనిచేసే హరిక్రిష్ణ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడి కొడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన వనజ మిల్స్ కాలీనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధిత మహిళ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఆదివారం ఫిబ్రవరి 28న హరిక్రిష్ణని పోలీస్ స్టేషన్‌కి రమ్మని పిలిచారు. భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్థాపానికి గురైన హరిక్రిష్ణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నేరుగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అమాంతం నిప్పంటించుకున్నాడు. మంటలు ఒళ్లంతా వ్యాపించాయి. కాలిపోతున్న హరిక్రిష్ణని చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. హరిక్రిష్ణను కాపాడే క్రమంలో కానిస్టేబుల్‌కి కూడా కాలిన గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో హరిక్రిష్ణ మార్చి 1, సోమవారం మృతిచెందాడు.