హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా -2021 సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, లైఫ్ సైన్సెస్ అడ్వైజరి కమిటీ చైర్మన్ సతీష్ రెడ్డి మరియు ఫార్మా రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచ నలుమూలల నుంచి 30 వేల మంది జీవశాస్ర్త నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫార్మా రంగం అభివృద్ధి, ఆరోగ్య రంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవ శాస్ర్త పరిశోధనలు, ఆవిష్కరణలపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్లాకు జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డులను మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయి. ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఎదురులేదన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫార్మా సెక్టార్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. జినోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్, బీ హబ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.