పదేళ్ళ పాటు నేనే సీఎం..!

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన మొదలైన సమావేశానికి దాదాపు 412 మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్ర పటానికి కేటీఆర్ నివాళులర్పించారు. సమావేశంలో సీఎం మార్పు గురించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నేనే సీఎంగా ఉంటాను. నేను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. కేటీఆర్ సీఎం అవుతున్నారనే అంశం మీద స్పందిస్తూ ఎందుకు అలా మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

ఏప్రిల్‎లో పార్టీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్న ఆయన ఈ నెల 12 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రతీ ఎమ్మెల్యే 50 వేల సభ్యత్వం నమోదు చేయించాలని ఆదేశించారు. మార్చి 1 నుండి పార్టీ కమిటీల నియామకం ఉంటుందని అన్నారు. 11 న మేయర్ ఎన్నికలకు అందరూ తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యేలందరూ కార్పొరేటర్‎లతో కలిసి జీహెచ్‎ఎంసీ వెళ్ళాలని, సీల్డ్ కవర్‎లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు పేర్లు ఉంటాయని, జీహెచ్‎ఎంసీలోనే కవర్ ఓపెన్ అవుతుందని చెప్పారు.

సీఎం మార్పు గురించి ఇకపై ఎవరు మాట్లాడొద్దని తేల్చి చెప్పారు. ఆయన రెండు నెలల పాటు ప్రతీ జిల్లా తిరుగుతానని వెల్లడించారు. సీఎం మార్పు అంశంపై మాట్లాడవద్దని సమావేశంలో పలుమార్లు తేల్చి చెప్పిన కేసీఆర్, అయినా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. ఫిబ్రవరి నెల అంతా మెంబెర్ షిప్ డ్రైవ్, మార్చి నెల అంతా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు ఉంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్‎లో రాష్ట్ర కమిటీ, పార్టీ ప్లీనరీ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.