వరదల ఉధృతిపై తక్షణ చర్యలు : చీఫ్ విప్

వరంగల్ అర్బన్ : భారీ వర్షాలు, వరద ముంపుపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో చీఫ్ విప్ ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ నగర కార్పొరేషన్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

ads

ప్రజలను దగ్గరలోని పంక్షన్ హాల్ లో ఉంచి వారికి అన్ని సదుపాయాలు అందించాలన్నారు. వరదల ఉధృతిపై ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు.

జలమయమైన ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 1800-425-1115 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు ఈ టోల్ ఫ్రీ నంబర్ ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా వారికి అవగాహన కల్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రజాప్రతినిధులకు దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.