చివరి టీ20లో భారత్ గెలుపు


అహ్మదాబాద్ : ఇంగ్లాండ్‎తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‎ను భారత్ 3-2 తో కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‎ను ఓడించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‎లో ఆల్ రౌండ్ షోతో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ సిరీస్‎ను ఘన విజయంతో ముగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (64 : 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ), విరాట్ కోహ్లీ ( 80 నాటౌట్ : 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ) అద్భుత అర్ధ శతకాలతో విజృంభించగా సూర్యకుమార్ యాదవ్ ( 32 :17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ) హార్దిక్ పాండ్య ( 39 నాటౌట్ : 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ) ధనాధన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఆతిథ‌్య బ్యాట్స్ మెన్ ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు.

ads

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ జట్టులో డేవిడ్ మలన్ ( 68 : 46 బంతుల్లో 98 ఫోర్లు, 2 సిక్సర్లు ) , జోస్ బట్లర్ ( 52 : 34 బంతుల్లో 2 ఫోర్లు , 4 సిక్సర్లు ) మాత్రమే అర్ధశతకాలతో రాణించారు. ఒకానొక దశలో వీరిద్దరి జోరుకు ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను టీం ఇండియా బౌలర్లు ఔట్ చేసి మ్యాచ్ పై పట్టు సాధించారు. ఆఖరిలో సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండటం, వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకుంది. బెన్ స్టోక్స్ ( 14) చెలరేగే ప్రయత్నం చేసినా నటరాజన్ బౌలింగ్ లో పెవిలియన్ బాటపట్టాడు . జేసన్ రాయ్ (0), జానీ బెయిర్ స్టో ( 7), ఇయాన్ మోర్గాన్ ( 1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ( 2 /15) , శార్దుల్ ఠాకూర్ (3/45) గొప్పగా బౌలింగ్ చేశారు.