వన్డే సిరీస్ ఇండియాదే

పుణె : సొంతగడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ పై టెస్టు, టీ 20 సిరీస్ లను కైవసం చేసుకున్న టీం ఇండియా వన్డే సిరీస్ లోనూ అదే తరహాలో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి 2-1 తో సిరీస్ ని చేజిక్కించుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కోహ్లీసేన 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. యువ ఆల్ రౌండర్ సామ్ కరన్ ( 95 నాటౌట్ : 83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ) ఒంటరిగా పోరాడి ఇంగ్లాండ్ ను గెలిపించినంత పనిచేశాడు. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా బంతిని అందుకున్న నటరాజన్ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్ కు విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులే చేసింది. ఛేదనలో డేవిడ్ మలన్ ( 50 : 50 బంతుల్లో 6 ఫోర్లు ) అర్ధశతకంతో రాణించగా బెన్ స్టోక్స్ ( 35) , లియామ్ లివింగ్ స్టోన్ ( 36 ) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివరిలో సామ్ కరన్ పోరాటం వృథా అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ , శార్దుల్ ఠాకూర్ ప్రత్యర్థిని భారీ దెబ్బకొట్టారు. ఇంగ్లాండ్ ఏ దశలోనూ కోలుకోకుండా వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు.

ads

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. శిఖర్ ధావన్ ( 67 : 56 బంతుల్లో 10 ఫోర్లు ), రిషబ్ పంత్ (78 : 62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ), హార్ధిక్ పాండ్య ( 64: 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ) అద్భుత అర్ధశతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో రోహిత్ శర్మ ( 37), ఆఖర్లో శార్దుల్ ఠాకూర్ ( 30 ) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయగా, అదిల్ రసీద్ రెండు వికెట్లతో చెలరేగాడు.