జాతీయ ఫుట్‎బాల్ కు సౌమ్య

నిజామాబాద్ జిల్లా: యువ స్ట్రైకర్ సౌమ్య తాజాగా భారత మహిళల సీనియర్ ఫుట్‎బాల్ జట్టులో చోటు దక్కించుకుంది. ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు టర్కీలో జరిగే అంతర్జాతీయ టోర్నీలో భారత్ తరపున సౌమ్య బరిలోకి దిగనుంది. జాతీయ సీనియర్ టీంలో చోటు దక్కించుకున్న తొలి తెలంగాణ మహిళా ప్లేయర్‎గా ఈ ఇందూరు ఆడపడుచు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడాభిమానులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు గోపీ, ధనలక్ష్మీ దంపతులకు 2001లో జన్మించింది సౌమ్య. పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో ఔరా అనిపించుకునే సౌమ్య కర్నూలులో 2012లో జరిగిన అండర్-14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా ఫుట్‎బాల్ కెరీర్ ప్రారంభించిన ఈ యువ స్ట్రైకర్ గోల్స్ చేయడమే లక్ష్యంగా ఎంచుకుంది. 2015లో ఖట్మాండులో జరిగిన ఆసియా ఫుట్‎బాల్ కాన్ఫడరేషన్ టోర్నీలో భారత అండర్-14 బాలికల జట్టుకు సౌమ్య ఎంపికైంది.

అయితే భారీ భూకంపం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. తృటిలో గాయాల నుంచి బయటపడింది సౌమ్య. ఆ తర్వాత ఏడాదే అండర్-16 ఆసియా చాంపియన్‎షిప్‎లో భారత్ తరపున అత్యధిక గోల్స్ చేసింది. 2018లో జోహెన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ అండర్-17 చాంపియన్‎షిప్‎లో భారత్ జట్టుకు సౌమ్య సారథ్యం వహించింది. వియత్నాం అండర్-19 టోర్నీతో సహా పలు జాతీయ స్థాయి టోర్నీల్లో మెరిసిన సౌమ్య తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.

ఇటీవల గోవాలో జరిగిన భారత సీనియర్ మహిళల ఫుట్‎బాల్ టీం క్యాంపునకు ఎంపికై సౌమ్య ప్రతిభకు సెలెక్టర్లు పట్టం కట్టారు. టర్కీలో జరిగే టోర్నీలో పోటీపడే భారత్ తరుపున సౌమ్యను ఎంపిక చేశారు.