ఫస్ట్ డే ఇంగ్లండ్‎దే సక్సెస్

చెన్నై: ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే చితగ్గొట్టి వచ్చిన టీం ఇండియా సొంతగడ్డపై సుమారు సంవత్సరం తర్వాత జరుగుతున్న టెస్ట్ తొలి రోజే నిరాశపరిచింది. 100వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్‎ జో రూట్ సెంచరీ చేయడంతో తొలి రోజు పూర్తిగా ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు263 పరుగులు చేసింది. ఒక దశలో 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను ఓపెనర్ సిబ్లీ (87)తో కలిసి రూట్ ఆదుకున్నాడు. టీం ఇండియా బౌలర్లను ఈ ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. మూడో వికెట్‎కు సరిగ్గా 200 పరుగులు జోడించారు. చివరి ఓవర్‎లో బుమ్రాకు వికెట్ల ముందు దొరికొపోయాడు సిబ్లీ.

అయితే మధ్యాహ్నం లంచ్‎కు ముందే ఆ రెండు వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్లు, తర్వాత రెండు సెషన్‎లలో ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు. రూట్ 164 బంతుల్లోనే 12 ఫోర్లతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 20వ సెంచరీ. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రూట్ 128 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇండియా బౌలర్లతో బుమ్రా2, అశ్విన్ ఒక వికెట్ తీశారు. మితగా బౌలర్లంతా ఫెయిల్ అయ్యారు.

2021లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆడిన ప్రతీ టెస్టులో సెంచరీ చేయడం విశేషం. శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లోనూ రూట్ సెంచరీలు చేశాడు. ఈ టీంతో రెండు టెస్టుల్లో వరుసగా 228, 186 పరుగులు తీసాడు. ఇప్పుడు ఇండియాలోనూ తన అద్భుతమైన ఫాంను కొనసాగిస్తున్నాడు రూట్ .