రేపే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను

ads

examresults.ap.ac.in bie.ap.gov.in results.bie.ap.gov.in results.apcfss.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు ఉంటాయా? రద్దవుతాయా? అనేదానిపై దాదాపు ఒకటిన్నర నెలలు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలా? లేదంటే పై తరగతుల సబ్జెక్టులు చదువుకోవాలో అర్థం కాక కొంత ఒత్తిడికి గురయ్యారు. పదో తరగతి విద్యార్థులు ఇంటర్‌లో చేరడంతో జేఈఈ పాఠ్యాంశాలపై ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి. రోజువారీ పరీక్షలు ఒక పక్క, పది పరీక్షలు ఎప్పుడు ఉంటాయో అనే ఒత్తిడి మరో పక్క కొనసాగింది. ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులు ఎంసెట్‌, జేఈఈ లాంటి పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షలకు రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో కొంత ఒత్తిడికి గురయ్యారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 5 నుంచి నిర్వహించేందుకు మొదట ఇంటర్‌ విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పరీక్షలను వాయిదా వేసింది. తర్వాత జులై మొదటివారంలో నిర్వహించాలని భావించారు. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో సంతృప్తి చెందకపోతే పరీక్షలకు అనుమతించబోమంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి విస్పష్టంగా తెలిపింది. పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని జులై 31లోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 40 రోజులు, పరీక్షల షెడ్యూలు ప్రకటనకు ముందు విద్యార్థులకు 15 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలు ఇవ్వడం సాధ్యం కానందున పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.