ఏసీసీ అధ్యక్షుడిగా జై షా

న్యూఢిల్లీ : ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 32 ఏండ్ల జై షా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్ నజ్నుల్ హసన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్లను నిర్వహించడంలో ఏసీసీ కీలకపాత్ర పోషిస్తుంది. ఈక్రమంలో కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ 2020 ఎడిషన్ ఈ ఏడాది జూన్ కు వాయిదా పడింది. పాకిస్థాన్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ టోర్నీ శ్రీలంక లేదా బంగ్లాదేశ్ లో జరుగుతుందని భావిస్తున్నారు. ఏసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినందుకు జై షాకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ శుభాకాంక్షలు తెలిపారు.