ఆస్కార్ నుంచి ‘జల్లికట్టు’ ఔట్


హైదరాబాద్: భారత్‎కు మరోసారి ‘ఆస్కార్’ నుంచి నిరాశే ఎదురైంది. అత్యత్తమ పురస్కారానికి ప్రవేశం సాధించి మలయాళ చిత్రసీమ ఖ్యాతిని పెంచింది ‘జల్లికట్టు’ . 93వ ఆస్కార్ పురస్కారాల కోసం భారత్ నుంచి పోటీకి పంపించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 27 ఉత్తమ చిత్రాలను పరిశీలించింది. లిజో జోస్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో తెరకెక్కిన జల్లికట్టును ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రతిపాదించింది. ఈ విభాగంలో 93 దేశాల నుంచి సినిమాలు ప్రవేశం సాధించగా, అందులో నుంచి 15 ఉత్తమ చిత్రాలతో తయారు చేసిన షార్ట్ లిస్టును ‘ది అకాడమీ’ తాజాగా ప్రకటించింది. అందులో ‘జల్లికట్టు’కు చోటు దక్కలేదు. దీంతో ఆస్కార్ రేసు నుంచి జల్లికట్టు నిష్క్రమించాల్సి వచ్చింది.

అయితే షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి ‘బిట్టూ’ చోటు దక్కించుకోవడం విశేషం. ఆ షార్ట్ ఫిల్మ్‎కు కరిష్మా దేవ్ దూబె దర్శకత్వం వహించారు. తుదిపోరుకు అర్హత సాధించిన ఈ 15 చిత్రాలు ఓటింగ్‎కు వెళ్తాయి. ఆ ప్రక్రియ మార్చి 5-9 తేదీల్లో ఉంటుంది. మార్చి 15న విజేతలను ప్రకటించి ఏప్రిల్ 25న పురస్కారాలు ప్రదానం చేస్తారు. కాగా లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొత్తం 10 సినిమాలు పోటీ పడుతుండగా, అందులో బిట్టూ కూడా ఒకటి.