కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్పించండి

లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ధర్నాలు
కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక సెల్: 
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డిజనగామ జిల్లా : కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి, ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల పునాదుల పై ఏర్పడిన తెలంగాణలో కరోనా పేషెంట్ల మృత్యు ఘోష వినిపిస్తుందన్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో 30 నుంచి 40 మంది కరోనా బారినపడి ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం కనీసం ఆదుకోవడం లేదని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు.

ads

ఆరోగ్యశ్రీ పథకంలో కరోనాను చేర్చని పక్షంలో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ఆరోగ్యశ్రీని తీసుకువస్తే, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కోవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పది మందితో కూడిన ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జంగా రాఘవ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో పది మంది సభ్యులను నియమించడంతో పాటు 4 సెల్ నంబర్లను విడుదల చేస్తామన్నారు. పాజిటివ్ వచ్చి ఆర్థికంగా చితికిపోయిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జంగా రాఘవరెడ్డి అన్నారు. తమకు సమాచారం అందించిన వెంటనే సరుకులను చేరవేసే ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఇక రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక భూకబ్జాలకు పాల్పడుతుంటే బీసీ నేత ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసైన్డ్ భూములను పట్టా చేసుకోగా.. కేటీఆర్, కవిత, మై హోమ్ రాజేశ్వరరావు వందలు, వేల ఎకరాల భూములను కబ్జా చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యమంలో కష్టపడి పనిచేసిన వారికి టీఆర్ఎస్ లో గుర్తింపు లేదని, తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తూ, ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆరోపించారు.