కరోనా బారిన జనసేన అధినేత

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం చేస్తున్నది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా నేడు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ కరోనా బారినపడ్డారు. దీంతో హైదరాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అపోలో ఆస్పత్రిలో వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పవన్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు.

ads

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నెల 3న బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకు మద్దతుగా నిర్వహించిన పాదయాత్ర, బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అక్కడి నుంచి రాగానే కరోనా పరీక్ష చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. స్వల్ప జ్వరం, ఒంటినొప్పులు ఉండటంతో మరోసారి పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పవన్ కల్యాణ్ కు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో వైద్యులు ఆయనకు యాంటీ వైరస్ మందులు అందిస్తున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి దంపతులు వైద్యులను ఆరా తీశారు. ఇటీవల పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది సైతం కరోనా బారినపడ్డారు. పవన్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన వారిలో చాలామందికి వైరస్ సోకిన విషయం తెలిసిందే.