ఆగస్టులో జేఈఈ-మెయిన్స్ ..సెప్టెంబర్ లో నీట్ !

న్యూఢిల్లీ : ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ నీట్ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ రానుంది. జేఈఈ మెయిన్స్ ఇప్పటికే రెండు సెషన్లు ముగియగా, మిగిలిన రెండు దశలను జూలై, ఆగస్టులో నిర్వహించాలని, నీట్ పరీక్షను సెప్టెంబర్ లో నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తున్నది. కరోనా నేపథ్యంలో జేఈఈని జూన్ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహిస్తామని, నీట్ సెప్టెంబర్ కు వాయిదా పడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు సమాచారం అందించాయి. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన ఎన్ ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షపై కూడా త్వరలో స్పష్టత రానుంది.

ads

విద్యార్థులు తమ స్కోర్ మెరుగుపరుచుకోవడానికి , మరింత మందికి అవకాశం కల్పించడానికి జేఈఈ మెయిన్స్ పరీక్షను ఈ ఏడాది నుంచి నాలుగు సెషన్లుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి సెషన్లు ముగిసాయి. ఇక ఏప్రిల్ , మే సెషన్లు కరోనాతో వాయిదా పడుతూ వస్తున్నాయి.

అయితే రాష్ట్రాల్లో కరోనా కేసులు నేపథ్యంలో ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై సందిగ్థత ఏర్పడింది. వీటితో పాటు జూలై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను కూడా వాయిదా వేశారు. ఇక నీట్ యూజీ పరీక్షను సెప్టెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.