కోటి వృక్షార్చనలో భాగస్వాములు కావాలి

హైదరాబాద్​: సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న నిర్వహించే కోటి వృక్షార్చనలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్ అన్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఎంపీ ఔషధ మొక్కలను పంపిణీ చేశారు.

‘ప్రకృతి, పచ్చదనం అవసరం బాగా తెలిపిన వ్యక్తి సీఎం కేసీఆర్​ అన్నారు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్. అందుకే రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఆరేళ్ల హరితహరం, మూడేళ్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని సంతోష్​కుమార్​ చెప్పారు. సీఎం పుట్టిన రోజు ఫిబ్రవరి -17 హరిత కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో కోటి వృక్షార్చన చేస్తున్నట్లు ఎంపీ వివరించారు. కోటి వృక్షార్చనలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికులకు వెయ్యి (1,000) ఔషధ మొక్కలు పంపిణీ చేశామన్నారు.

బుధవారం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వచ్ఛందంగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కల రక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. కొచ్చిన్ నుంచి ఎయిర్ పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులు మొదటి మొక్కను అందుకున్నారు. పంజాబ్ నుంచి వచ్చిన అరుణ్ గుప్తా, సీమా గుప్తా, ముంబై నుంచి వచ్చిన చిన్నారులు ఆర్యా, జహార్ లు మొక్కలను అందుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తీసుకున్న మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రయాణికులు ప్రశంసించారు. తమకు ఇచ్చిన మొక్కలను ప్రేమతో పెంచుకుంటామని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులు ముఖ్యమంత్రికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ పానేకర్ పాల్గొన్నారు. గత మూడేళ్లుగా తాము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్నామని, పచ్చదనం కోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా ఎయిర్ పోర్టు పరిసరాల్లో ప్రతీ యేటా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్, ఏవియేషన్ డైరెక్టర్ వీఎన్. భరత్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి కరుణాకర్, రాఘవ, విమానాశ్రయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.