పోషకాహార లోప నివారణకు చర్యలు

హైదరాబాద్ : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలో మహిళలు, శిశువులలో పోషకాహార లోపాన్ని పూర్తిగా నివారించేందుకు అత్యుత్తమ ప్రణాళిక తయారు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఆరోగ్య లక్ష్మి , కేసీఆర్ కిట్ వల్ల బాల, బాలికల నిష్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, మాతా, శిశు మరణాలు తగ్గడం రేటు కూడా దేశంలో అత్యధికంగా తెలంగాణలో నమోదు అయిందదని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. పోషకాహార లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్​లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

‘తెలంగాణలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం వల్ల గర్భిణులు, బాలింతలకు పోషకాహార లోపం చాలా వరకు తగ్గిందని సర్వేల ద్వారా వెల్లడైందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆరోగ్య లక్ష్మి పథకంలో ప్రతిరోజు 200 మిల్లీ లీటర్ల పాలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పోషకవిలువలున్న భోజనం, బాలామృతం, గుడ్డు, ఐరన్ మాత్రలు ఇవ్వడం వల్ల గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితి మెరుగైందన్నారు.

అదేవిధంగా గర్భిణి అయిన తర్వాత పనిచేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి ప్రమాదమని భావించి గర్భిణులకు 6వ నెల నుంచి, ప్రసవించిన తర్వాత మూడో నెల వరకు నెలకు రూ. 2000 చొప్పున ఆరు నెలల పాటు 12వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి వెల్లడించారు. ఇంటి వద్ద ఉండి మంచి ఆహారం తీసుకోవడం వల్ల, ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల మాతా, శిశు మరణాల తగ్గుదల రేటులో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి సత్యవతి వివరించారు.

అంతే కాకుండా భ్రూణహత్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడం వల్ల తెలంగాణలో బాల, బాలికల నిష్పత్తి దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1000 మంది బాలురకు 1049 మంది బాలికలు ఉండడం ఈ రాష్ట్రంలో బాలికల సంరక్షణ, బాలికలకు ఇస్తున్న ప్రోత్సాహానికి నిదర్శనమని మంత్రి చెప్పారు.

అయితే శిశువుల్లో వయసుకు తగిన ఎదుగుల, ఎత్తుకు తగిన బరువు అనుకున్న స్థాయిలో లేకపోవడం పట్ల ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నివారించి, వారికి ఆరోగ్యకర ఎదుగుదల ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి సత్యవతి చెప్పారు. ఇందులో భాగంగా దేశంలో శిశువుల కోసం ఎక్కడెక్కడ మంచి పథకాలు, కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటిని అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయనున్నట్లు స్పష్టంచేశారు.

ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ప్రతి రోజు 200 మిల్లీలీటర్ల పాలు, గుడ్లు ఇస్తున్నామని, త్వరలో 7నెలల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న శిశువులకు కూడా పాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలామృతం ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామని, జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్) సలహాలతో ఈ బాలామృతాన్ని మరింత అభివృద్ధి చేసి రుచికరంగా, ఆరోగ్యకరంగా రూపొందించే పనిలో ఉన్నాని మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో గిరిపోషణ, ఇప్పపూవు లడ్డూలను ఇవ్వడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించే కార్యక్రమం పైలట్ ప్రాజెక్టులో చేపట్టామన్నారు. ఇది జయవంతమైందన్నారు. దీనిని పోషకాహార లోపం తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

కొవిడ్ సమయంలో కూడా పేదలకు పోషకాహారాన్ని అందించాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు అంగన్వాడీలు ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చారని అన్నారు. ఇందులో గుడ్లు, పాలు, పప్పులు, నూనెలు ఉన్నాయన్నారు. కొవిడ్ సమయంలో అంగన్వాడీలు చేసిన సేవకు గుర్తింపుగా ఏజన్సీ ప్రాంతమైన భద్రాద్రి –కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, టేకులగూడెం మినీ అంగన్ వాడి కార్యకర్త చంద్రకళకు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ అంగన్ వాడీ కార్యకర్త అవార్డు లభించిందన్నారు. చంద్రకళకు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ సమయంలో పనిచేసిన అంగన్వాడీలకు ధన్యవాదాలు’మంత్రి సత్యవతి రాథోడ్​ వారి సేవలను కొనియాడారు.

‘ తెలంగాణలో పోషకాహార లోపం ఎక్కడ ఉండకూడదన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్​ అన్నారు. దీనికనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. కేసిఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి పథకం, గర్భిణీ స్త్రీలు పనికి వెళ్లకుండా ఉండేందుకు ఆరు నెలల పాటు ఇచ్చే రూ. 12వేల వంటి పథకాలు విజయవంతం కావడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని స్మిత సబర్వాల్​ చెప్పారు. అదేవిధంగా మరో అద్భుతమైన కార్యక్రమం ద్వారా తెలంగాణలో శిశువుల్లో పోషకాహార లోపం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’ స్మిత సబర్వాల్​ స్పష్టంచేశారు.

రాష్ట్రంలో మహిళలు, శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం , పోషకాహారాన్ని అందించేందుకు అంగన్ వాడీల తరపున తీసుకుంటున్న చర్యలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య వివరించారు. 7 నెలల నుంచి 3 ఏళ్ల వరకు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు గల పిల్లల కోసం అంగన్ వాడీల ద్వారా బాలామృతం, గుడ్లు ఇస్తున్నామని తెలిపారు.

అంగన్ వాడీలలో పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని, కొవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆగిందని, మళ్లీ మార్చిలో పిల్లల ఎదుగుదలను నమోదు చేస్తామని కమిషనర్​ దివ్య వెల్లడించారు. దీనికనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత వస్తుందని, ఆ మేరకు సీఎం కేసీఆర్​కు ,మంత్రి సత్యవతి రాథోడ్​కు నివేదిక ఇచ్చి ప్రతిపాదనలు ఇస్తామన్నారు. మిగిలిన అధికారులు కూడా పిల్లల ఎదుగుదలను మరింత సమర్థవంతంగా పెంచేందుకు అనేక ప్రతిపాదనలు చేశారు. మరో సమావేశం పెట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను కూడా సమీక్షించాలన్నారు. తెలంగాణలో వాటిన్నింటిని క్రోడీకరించి అత్యుత్తమ విధానం తీసుకురావడంపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు.

సమావేశంలో అంగన్వాడీ కేంద్రాలలో బాలురు, బాలికల ఎదుగుదలను నమోదు చేసి తల్లిదండ్రులకు ఇచ్చే పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డును మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, అధికారులు ఆవిష్కరించారు. ఇందులో పిల్లల ఎదుగుదలను నమోదు చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైన పిల్లలు ఎలా ఉండాలనేది కూడా ముద్రించామని దానికనుగుణంగా తల్లిదండ్రుల పిల్లల ఎదుగుదల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉందని మంత్రి సత్యవతి చెప్పారు.

ఈ సమావేశానికి సీఎం కార్యలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఎన్ఐఎన్ ప్రతినిధులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.