గొల్ల కురుమల అభివృద్ధికి పాటుపడుతున్నది సీఎం కేసీఆరే

హైదరాబాద్ : ఇప్పటిదాకా మేము ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, మాకు గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం స్పష్టం చేసింది. ఈ దేశంలో కేవలం గొల్ల కురుమల గురించి ఆలోచించి వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ మాత్రమేనని, గత పాలనలో పేదరికంలో మగ్గిన తెలంగాణ కురుమలు స్వయం పాలనలో ధనికులుగా మారారని, అందుకు సీఎం విధానాలే కారణమని తెలంగాణ కురుమ సంఘం తెలిపింది.

ads

గొర్రెల యూనిట్ ధరను పెంచడమే కాకుండా, రూ. 6 వేల కోట్లతో తమకు రెండవ విడత గొర్రెలను పంపిణీ చేస్తున్నందుకు బుధవారం ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, సంఘం నాయకులు కె. నర్సింహ, అరుణ్ కుమార్, నగేశ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. “తెలంగాణలో ప్రతీ వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పం. అదే మా సిద్ధాంతం. గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం. రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి సంవత్సరమే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించినం. అప్పుడు ఏ ఎన్నికలున్నయి? మాది ఎన్నికల విధానం కాదు, తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే మా విధానం. తెలంగాణ సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగిస్తున్న పథకాలు ఎల్లకాలం కొనసాగేలా రూపొందించాము. తెలంగాణ రాకముందు పల్లె పల్లెనా పల్లేర్లు మెలిసే అని పాడుకున్నం కానీ ఇప్పుడు పల్లె పల్లెనా పంట పొలాలు పచ్చగ మెరుస్తున్నయి” అని సీఎం స్పష్టం చేశారు.

గొర్రెల పెంపకానికి గ్రామాల్లో షెడ్ల నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నామని సీఎం అన్నారు. యాదవులు, గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టామని సీఎం అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని, గొర్రెల పాపులేషన్ లో నేడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని సీఎం అన్నారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే వుంటుందని సీఎం పునరుద్ఘాటించారు.