ముగిసిన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ
50 నిమిషాల పాటు కొనసాగిన కేసీఆర్ విచారణవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కమిషన్ కు కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కమిషన్ కు కేసీఆర్ అందచేశారు. కమిషన్ అడిగిన ప్రతీ ప్రశ్నకు ఆధారాలతో సహా కేసీఆర్ నివేదిక సమర్పించారు.
ఇప్పటి వరకు 114 మందిని విచారించింది కమిషన్. కాళేశ్వరం కమిషన్ విచారణకు 115వ వ్యక్తిగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ విచారణతో కమిషన్ ఎంక్వయిరీ పూర్తి అయింది. జులై చివరి వారంలో ప్రభుత్వానికి కమిషన్ పూర్తి నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది.
విచారణ అనంతరం బయటకు వచ్చిన కేసీఆర్ నేరుగా తన కారులో ఎక్కి కూర్చొన్నారు. అనంతరం అక్కడున్న పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. కేసీఆర్ కారులోనే హరీష్ రావు కూడా వెళ్లారు.ఉదయం 9 .30 గంటల సమయంలో ఎర్రవల్లి నుంచి కేసీఆర్ హైదరాబాద్ కు బయల్దేరారు. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి,ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహముద్ అలీ బీఆర్కే భవన్ లోకి వెళ్లారు.
ఇక కేసీఆర్ విచారణ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్కే భవన్ కి చేరుకున్నారు. కేసీఆర్ విచారణ అనంతరం బయటికి రాగానే జై కేసీఆర్, జై తెలంగాణ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.