పంజాబ్ పై కోల్ కతా ఘన విజయం

అహ్మదాబాద్ : కోల్ కతా నైట్ రైడర్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. పంజాబ్ కింగ్స్ తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 124 పరుగుల ఛేదనలో రాహుల్ త్రిపాఠి (41 : 32 బంతుల్లో 7 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్ (47 నాటౌట్ : 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ) రాణించడంతో 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదన ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలినా కోల్ కతా జోరు ఎక్కడా తగ్గలేదు. మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్నందించాడు. మొదట పంజాబ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించడంతో లక్ష్య ఛేదన సులువైంది.

ads

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. మయాంక్ అగర్వాల్ ( 31 : 34 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు ) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (19) , క్రిస్ గేల్ (0), దీపక్ హుడా (1), నికోలస్ పూరన్ (19), హెన్రిక్స్ (2), షారుక్ ఖాన్ (13) నిరాశపరిచారు. ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా పాట్ కమిన్స్ సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.